పరువు నష్టం కేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు బెయిల్

బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-06-01 09:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌‌లు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్ తీసుకుంటుందని ఆరోపించారు. అలాగే, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోస్టర్లను ప్రదర్శించింది. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని, పార్టీని నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారని పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది.

తాజాగా ఈ కేసులో వారు 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. వారి పిటిషన్‌ను విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఒక ప్రైవేట్ ఫిర్యాదుకు సంబంధించి తాను కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. చట్టాన్ని రక్షించే వ్యక్తిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను న్యాయమూర్తి ముందు హాజరై బెయిల్ పొందాను. రాహుల్ గాంధీ కూడా కోర్టుకు హాజరు కానున్నారని పేర్కొన్నారు.

అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని కాషాయ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి గతంలో కోర్టు సమన్లు జారీ చేసింది.


Similar News