Sharad Pawar: నా గురించి సమాచారం సేకరించేందుకు భద్రత పెంపు

‘జడ్ ప్లస్’ సెక్యూరిటీ కేటాయింపుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు.

Update: 2024-08-23 09:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘జడ్ ప్లస్’ సెక్యూరిటీ కేటాయింపుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. తనగురించి సమాచారం సేకరించేందుకు ఈ ఏర్పాట్లు చేసిఉండొచ్చని చురకలు అంటించారు. ‘‘భద్రత పెంపునకు కారణాలేంటో నాకైతే తెలీదు. ముగ్గురికి జడ్ ప్లస్ (Z plus security) భద్రత ఇవ్వాలని కేంర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడిగితే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రహోంమంత్రి అమిత్ షా అని చెప్పారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు.. నా గురించి రహస్యంగా సమాచారం సేకరించేందుకే ఈ ఏర్పాట్లు చేసి ఉండొచ్చు ’’ అని శరద్ పవార్‌ (Sharad Pawar) కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

భద్రత ఎవరికోసమంటే?

దేశంలోని ప్రముఖులు, వీవీఐపీలకు జడ్‌ ప్లస్‌, జడ్‌, వై ప్లస్‌, వై, ఎక్స్‌ కేటగిరీల్లో భద్రతను కల్పిస్తుంటారు. నిఘా వర్గాల నుంచి అందే సమాచారం మేరకు వారికున్న ముప్పును బట్టి ఆయా కేటగిరీల్లో భద్రతను అందిస్తారు. జడ్‌ ప్లస్‌ కింద 55 మంది సీఆర్పీఎఫ్‌ సాయుధ బలగాల బృందం సెక్యూరిటీగా ఉంటుంది. ఇకపోతే, ఇటీవలే ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)కు ‘జడ్‌ ప్లస్‌’ కేంద్రం భద్రతను కల్పించింది. శరద్ పవార్ కు ముప్పు ఉందని కేంద్రఏజెన్సీ నుంచి అందిన నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రహోంశాఖ వెల్లడించింది. అయితే, ఈ పరిణామాలపైనే శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర (Maharashtra)లో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికలను వాయిదా వేసింది. దీనిపై విపక్షాలు రచ్చ చేస్తున్నాయి.


Similar News