Delhi HC: న్యాయపోరాటాలతో కాదు.. చేసే పనివల్ల గౌరవం
శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. స్వామి గోవిందానంద సరస్వతి తనను దొంగబాబా అని అనడాన్ని తప్పు పడుతూ పరువునష్టం దావా వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు.శివానంద యోగ విద్యాపీఠం వ్యవస్థాపకులు స్వామి గోవిందానంద సరస్వతి తనను దొంగబాబా అని అనడాన్ని తప్పు పడుతూ పరువునష్టం దావా వేశారు. అయితే, ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సాధువులు పరువు నష్టం గురించి ఆందోళన చెందవద్దని పేర్కొంది. గౌరవం ప్రతిష్ఠ చేసే పని వల్ల వస్తుంది కానీ.. న్యాయ పోరాటాల వల్ల కాదని సూచించింది.
శంకరాచార్యపై విమర్శలు
స్వామి గోవిందానంద శంకరాచార్యను ‘దొంగ బాబా’ అన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హత్య, కిడ్నాప్‌తో సహా తీవ్రమైన క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. రూ.7,000 కోట్ల బంగారాన్ని దొంగిలించినట్లు, సాధ్వీలతో సంబంధాలు పెట్టుకొన్నట్లు ఆరోపించారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ దశలో ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని తెలిపింది. ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది.