వివాహేతర శృంగారం నేరం కాదు.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు.. భర్తను కాదని ఆ ముగ్గురికే సపోర్టు చేసిన మహిళ
Sex outside marriage not an offence, Rajasthan High Court, non-marital, sexual relationship, illegal affair
దిశ, నేషనల్ బ్యూరో: వివాహేతర సంబంధాలపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో జరిగే వివాహేతర శృంగారం చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం కాదంటూ స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా సదరు మహిళను కోర్టు ముందు హాజరుపర్చగా, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరితో సహజీవనం చేస్తున్నట్టు న్యాయస్థానం ముందు వెల్లడించింది. దీంతో సదరు వ్యక్తి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వివాహేతర సంబంధాన్ని దరఖాస్తుదారుడి భార్య అంగీకరించిందని, కావునా సెక్షన్ 494 (భర్త లేదా భార్య జీవించి ఉన్నప్పుడు వివాహం), సెక్షన్ 497 (వ్యభిచారం నేరం) కింద చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయస్థానం తన అధికార పరిధిని వినియోగించుకుని వివాహేతర సంబంధాన్ని కాకుండా సామాజిక నైతికతను కాపాడేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ బీరేంద్ర కుమార్ తుది తీర్పును వెలువరించారు. పరస్పర ఇష్టంతో జరిగే వివాహేతర శృంగారం నేరం కిందికి రాదని, సదరు మహిళ చేసిన పనిని నేరంగా పరిగణించలేమని తెలిపారు. సెక్షన్ 497 ప్రకారం, వివాహేతర సంబంధాలు వ్యభిచారం పరిధిలోకి వస్తాయని తెలిపిన ఆయన.. ఈ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2018లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినట్టు గుర్తుచేశారు. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా మహిళపై చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.