Wayanad Landslide: వయనాడ్ విషాదాన్ని 'జాతీయ విపత్తు'గా ప్రకటించిన కేంద్రం
కొండచరియలు విరిగిపడిన అన్ని ప్రాంతాల్లో జరిగిన తీవ్రత, ప్రభావాన్ని గుర్తించిన అనంతరం 'తీవ్ర విపత్తు 'గా ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తి కారణంగా వందలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. చాలా కుటుంబాల్లో దుఃఖాన్ని నింపిన ఈ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అనేక వర్గాల నుంచి డిమాండ్ వినిపించింది. మూడు గ్రామాలను పూర్తిగా ధ్వంసం చేసిన ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు జాతీయ విపత్తుగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కొండచరియలు విరిగిపడిన అన్ని ప్రాంతాల్లో జరిగిన తీవ్రత, ప్రభావాన్ని గుర్తించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని 'తీవ్ర విపత్తు 'గా ప్రకటించింది. కేరళ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టింకు బిస్వాల్‌కు రాసిన లేఖలో, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన విధ్వంసాలను సమీక్షించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం వయనాడ్ ఘటనను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నట్లు తెలియజేసింది. సహాయ, పునరావాస చర్యల కింద ఆర్థిక సాయాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్ఎఫ్) అందజేస్తుందని వివరించింది. ఈ విపత్తుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్‌డీఆర్ఎఫ్) నిధి నుంచి నిధులు కేటాయించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, జూలై 30న వయనాడ్‌లోని చూరల్‌మల, ముండక్కై ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కుండపోత వర్షాల కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, అనేక మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇది కేరళ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.
వీలైనంత త్వరగా నిధులు కేటాయించాలి: ప్రియాంకా గాంధీ
వయనాడ్ విషాదాన్ని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఈ చర్యల వల్ల పునరావాసం అవసరమైన వ్యక్తులకు సహాయం అందుతుంది. సరైన సమయంలో ఒక అడుగు ముందుకు పడటం శుభపరిణామం. వీలైనంత త్వరగా దీనికి తగిన నిధులు కేటాయించాలి’ అని పేర్కొన్నారు.