Bangladesh Crisis:బంగ్లాదేశ్ లో మరోసారి చెలరేగిన హింస

పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ అస్థిరత ఉన్న బంగ్లాదేశ్ లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి.

Update: 2024-08-26 06:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ అస్థిరత ఉన్న బంగ్లాదేశ్ లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఆదివారం రాత్రి బంగ్లా రాజధాని ఢాకాలో విద్యార్థులు, పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విలేజ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌గా పిలిచే అన్సార్‌ సభ్యులు (Ansar Members) తమ ఉద్యోగాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ గత రెండ్రోజులుగా ఆందోళన చేపట్టారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో అన్సార్ సభ్యులు ఆందోళన విరమించారు. కాగా.. ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఢాకా యూనివర్సిటీ నుంచి సెక్రటేరియట్ వరకు మార్చ్ చేపట్టాయి. దీన్ని అన్సార్‌ సభ్యులు అడ్డుకున్నారు.

మరోసారి ఉద్రిక్తతలు

తాత్కాలిక ప్రభుత్వంలో అడ్వైజర్‌గా ఉన్న విద్యార్థి నాయకుడు నహీద్‌ ఇస్లామ్‌ సహా పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నహీద్ ఇస్లామ్ అరెస్టు, బంగ్లాదేశ్‌ అవామీ లీగ్‌ నేత అబుల్‌ హస్నత్‌ అబ్దుల్లాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలియగానే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం రాత్రి 9.20 గంటల తర్వాత విద్యార్థులు మరోసారి ఆందోళనలు చేపట్టారు. ఇవి హింసాత్మకంగా మారాయి. పోలీసులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగింది. శాంతిభద్రతలను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టింది. మరోవైపు, హస్నత్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్‌ చేశారు. తన నిర్బంధానికి మాజీ అన్సార్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏకేఎం అమీనుల్ హక్ బాధ్యత వహించాలని ఆయన దానిలో డిమండ్‌ చేశారు. ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే, మరోసారి అల్లర్లు చోటుచేసుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది

ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి దేశాన్ని వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఉన్నారు. హసీనా ప్రభుత్వం రద్దవడంతో అక్కడ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. తాజా అల్లర్లపై యూనస్‌ స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శిఖరం లాంటి సవాళ్లను అధిగమించాలని అన్నారు.


Similar News