Senthil Balaji case: మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వలేం : సుప్రీంకోర్టు

తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని చికిత్స నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Update: 2023-06-21 13:36 GMT

న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని చికిత్స నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. హైకోర్టునే ఆశ్రయించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు సూచించింది. దీనిపై తదుపరి విచారణను జులై 4కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జయలలిత హయాంలో లంచాలు పుచ్చుకొని తమిళనాడు రవాణా శాఖ ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలతో బాలాజీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ జూన్ 14న అరెస్ట్ చేసింది.

తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందిన మంత్రి బాలాజీని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఈడీ సవాలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈడీ అరెస్టుపై బాలాజీ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరికావని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం ఉదయం కావేరి ఆసుపత్రిలో హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. 47 సంవత్సరాల బాలాజీ జూన్ 14న ఈడీ అరెస్టు చేసిన తరువాత ఛాతీ నొప్పి రావడంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. అనంతరం వైద్యులు బైపాస్ సర్జరీని సిఫార్సు చేయడంతో ఆ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు.


Similar News