ఇండియన్ ఆర్మీ డ్రెస్ కోడ్‌లో కీలక మార్పు..

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భారత సైన్యం యూనిఫామ్ విషయంలో భారీ మార్పు చోటు చేసుకుంది.

Update: 2023-08-01 16:30 GMT

న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భారత సైన్యం యూనిఫామ్ విషయంలో భారీ మార్పు చోటు చేసుకుంది. పేరెంట్ క్యాడర్, ప్రారంభ నియామకంతో సంబంధం లేకుండా బ్రిగేడియర్, అంతకంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉన్న సీనియర్ అధికారులకు ఇండియన్ ఆర్మీ కొత్త కామన్ యూనిఫాం రెగ్యులేషన్‌ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 17 నుంచి 21 వరకు జరిగిన ఆర్మీ కమాండర్ల సదస్సులో యూనిఫాం మార్పుపై నిర్ణయం తీసుకున్నారని ఆర్మీ ఆఫీసర్లు వెల్లడించారు.

ఫ్లాగ్ ర్యాంక్ (బ్రిగేడియర్ మరియు అంతకంటే ఎక్కువ)లో ఉన్న సీనియర్ అధికారులందరి తలపాగా, భుజంపై ఉండే ర్యాంక్ బ్యాడ్జ్, గోర్గెట్ ప్యాచ్, బెల్ట్, పాదరక్షలు ఇప్పుడు ప్రామాణికంగా ఒకేలా ఉండాలని నిర్ణయించారని చెప్పారు. దీని ప్రకారం.. ఫ్లాగ్-ర్యాంక్ అధికారులు ఇకపై ఎలాంటి దారాన్ని (లాన్యార్డ్) తమ యూనిఫామ్లపై ధరించరు. రెజిమెంట్లకు అతీతంగా ఆర్మీ సీనియర్ క్యాడర్ నాయకత్వంలోని వారందరికీ ఒకే విధమైన గుర్తింపును కల్పిస్తూ, ఏకత్వాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కల్నల్ స్థాయి కంటే తక్కువ స్థాయి అధికారులు ధరించే యూనిఫాంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.


Similar News