Sabarimala : రేపు శబరిమలలో మండల పూజ.. అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్న ‘తంగఅంకి’

దిశ, నేషనల్ బ్యూరో : శబరిమల(Sabarimala)లో అయ్యప్ప స్వామి మండల పూజ(Mandala Pooja) గురువారం రోజు జరగనుంది.

Update: 2024-12-25 15:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : శబరిమల(Sabarimala)లో అయ్యప్ప స్వామి మండల పూజ(Mandala Pooja) గురువారం రోజు జరగనుంది. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్‌ డిసెంబరు 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల మధ్య శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కందారరు రాజీవారు మండల పూజను నిర్వహిస్తారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో కేరళీయులు కూడా పెద్దసంఖ్యలో అయ్యప్ప స్వామి మండలపూజకు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ట్రావన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మండల పూజ, అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం నిర్వహించిన అనంతరం అయ్యప్ప ఆలయ పోర్టల్స్ అన్నీ బంద్ అవుతాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి అవి పనిచేయవు. మకర విలక్కు పండుగ సందర్భంగా శబరిమల ఆలయం డిసెంబరు 30న సాయంత్రం తిరిగి తెరుచుకుంటుంది. స్వామివారి సన్నిధానంలో జనవరి 14న ప్రత్యేక పూజలు జరుగుతాయి.

తంగఅంకి అంటే..

మండల పూజల్లో అత్యంత కీలకమైన ఘట్టం తంగఅంకి కార్యక్రమం. అరన్ములలోని పార్థసారథి ఆలయం నుంచి ఈ నెల 22న ఉదయం 7గంటలకు ప్రారంభమైన తంగఅంకి రథం.. బుధవారం సాయంత్రం శబరిమల అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంది. తంగఅంకి రథంలో తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించే పవిత్ర బంగారు ఆభరణాలనే తంగఅంకి అని పిలుస్తారు. 1970వ దశకంలో 453 సవర్ల బరువున్న బంగారు ఆభరణాలను అయ్యప్పకు ట్రావన్‌ కోర్ సంస్థానం సమర్పించింది. ఈ ఆభరణాలను అరన్ముల పార్థసారథి ఆలయంలో భద్రపరుస్తుంటారు.

Tags:    

Similar News