S Jaishankar: పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. విదేశాంగ మంత్రి జైశంకర్

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి రావాలని ప్రధాని మోడీని పాకిస్థాన్ ఆహ్వానించిన నేపథ్యంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-30 09:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశానికి రావాలని ప్రధాని మోడీని పాకిస్థాన్ ఆహ్వానించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి పనిచేయలేవని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే కాలం ముగిసిందని, ఉగ్రదాడులకు మద్దతిచ్చే వారి చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ విషయంలోనూ రాజీపడబోమన్నారు. ఆర్టికల్ 370 పూర్తయిందని భావిస్తున్నానని, కానీ పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలనే విషయంపైనే సమస్య ఉందని తెలిపారు.

భారత్‌తో చర్చలు జరపాలనుకుంటే పాకిస్థాన్ తన విధానాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో బలమైన సంబంధాలున్నాయని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన ఆఫ్ఘన్ విధానాన్ని అభినందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పొరుగు దేశాలు ఎప్పుడూ తికమక పెట్టేవేనని, వాటితో నిరంతరం సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య వివాదాలను పరిష్కరించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.  


Similar News