Jai Shankar: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధంపై భారత్‌ ఆందోళన

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

Update: 2024-10-02 07:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. వాషింగ్టన్‌లోని థింక్‌ తాంక్‌ కార్నేగీ ఎండోమెంట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తల గురించి మాట్లాడారు. ‘భారత్‌ కేవలం ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య యుద్ధం గురించే ఆందోళన చెందడం లేదు. లెబనాన్‌, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ పరిణామమైనా ఉద్రిక్తం అయ్యే విషయంపైనా ఆందోళన చెందుతుంది. అక్టోబరు 7ని తీవ్రవాద దాడిగా పరిగణిస్తాం. ఇజ్రాయెల్‌ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాం. ’ అని జై శంకర్‌ పేర్కొన్నారు.

చర్చలతో ఘర్షణలను ఆపవచ్చు

అయితే.. ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని జైశంకర్ హితవు పలికారు. అది ఎంతో ముఖ్యం. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయవద్దన్నారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే, హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటుంది. మంగళవారం రాత్రి దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ దాడులను ఇజ్రాయెల్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.


Similar News