Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఇంధన వనరులే లక్ష్యంగా భారీ దాడి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ (Ukrein) పై రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. ఖార్కీవ్ (Kharkiv) నగరంలోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. బాలిస్టిక్ క్షిపణుల(Balistic missiles)తో సహా 70కి పైగా క్షిపణులు,100కి పైగా డ్రోన్లతో విద్యుత్ వనరులపై అటాక్ చేసినట్టు ఇంధన మంత్రి హెర్మన్ హలుష్చెంకో తెలిపారు. ఇంధన సదుపాయాలే టార్గెట్‌గా దాడి చేసిందని వెల్లడించారు. ఈ దాడుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డట్టు ఖార్కీవ్ గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ (cinehubow) ధ్రువీకరించారు. ఖార్కివ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా అటాక్ చేసిందని దీనివల్ల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ పై రష్యా దాడి చేయడం ఇది 13వ సారి.
ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజు దాడి: జెలెన్ స్కీ
ఇంధన వనరులే లక్ష్యంగా అటాక్ చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (zelenskee) స్పందించారు. క్రిస్మస్ రోజు ఉద్దేశ పూర్వకంగానే పుతిన్ (Putin) దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడి అమానవీయమని తెలిపారు. ఇటువంటి దాడులు ప్రణాళిక ప్రకారం చేసినవేనని ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు కాదని నొక్కి చెప్పారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో 50కి పైగా మిస్సైల్స్‌ను ఉక్రెయిన్ వైమాణిక దళం కూల్చి వేసిందని తెలిపారు. రష్యా దురాక్రమణ ఉక్రెయిన్‌ను విచ్ఛిన్నం చేయబోదని వెల్లడించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని, వీలైనంత త్వరగా దానిని పునరుద్ధరిస్తామన్నారు.