శత్రువుల వెన్నులో వణుకే.. యాంటీ రేడియేషన్ క్షిపణి రెడీ

దేశీయంగా అభివృద్ధి చేసిన ‘రుద్రమ్-II’ యాంటీ రేడియేషన్ సూపర్‌సోనిక్ క్షిపణిని బుధవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.

Update: 2024-05-29 14:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయంగా అభివృద్ధి చేసిన ‘రుద్రమ్-II’ యాంటీ రేడియేషన్ సూపర్‌సోనిక్ క్షిపణిని బుధవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీనిని ఒడిశా తీరంలో Su-30MKI ఫైటర్ జెట్ నుంచి పరీక్షించారు. ఈ ప్రయోగంలో ప్రొపల్షన్ సిస్టమ్, కంట్రోల్ అండ్ గైడెన్స్ అల్గారిథమ్‌, రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్‌లను పరిశీలించారు, క్షిపణి అన్ని ట్రయల్ లక్ష్యాలను చేరుకుందని అధికారులు తెలిపారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా ఆన్-బోర్డ్ షిప్‌తో సహా వివిధ ప్రదేశాలలో మోహరించిన ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్, రాడార్, టెలిమెట్రీ స్టేషన్‌ల వంటి ట్రాకింగ్ పరికరాల ద్వారా వచ్చిన డేటాను పరిశీలించగా క్షిపణి నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసింది.

ఇది శత్రువుల రాడార్, ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్‌‌లకు దొరకదు. క్షిపణి ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS), ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌తో కూడిన నావిగేషన్ మెకానిజంను ఉపయోగించి శత్రువుల బంకర్‌లు, ఓడలు, విమానాలు మొదలగు వాటిని నాశనం చేస్తుంది. దీని వేగం గంటకు 6,791.4 కి.మీ. ధ్వని వేగం కంటే ఐదు రేట్లు వేగంతో ప్రయాణిస్తుంది. రుద్రమ్-II పరిధి 300 కి.మీ. గరిష్టంగా 3 నుంచి 15 కి.మీ ఎత్తుకు చేరుకుంటుంది. దీని పొడవు 18 అడుగులు. భారతదేశం ప్రస్తుతం రష్యా Kh-31, యాంటీ రేడియేషన్ క్షిపణిని ఉపయోగిస్తుంది. ఇప్పుడు దాని స్థానంలో రుద్రం క్షిపణులు వాడుతారు. రుద్రమ్-II విజయవంతంగా ప్రయోగించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ DRDO, IAF సిబ్బందిని అభినందించారు.


Similar News