ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్‌పై వివాదాస్పద పోస్ట్.. మాజీ సీఎంపై ఎఫ్ఐఆర్

ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై ట్విట్టర్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పై ఇండోర్‌లోని తుకోగంజ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది.

Update: 2023-07-09 12:01 GMT

ఇండోర్ : ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై ట్విట్టర్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పై ఇండోర్‌లోని తుకోగంజ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండోర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది రాజేష్ జోషి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 153-ఏ, 469, 500, 505 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోల్వాల్కర్‌ను కించపరిచేలా.. దళితులు, వెనుకబడినవారు, ముస్లింల సమాన హక్కులకు గోల్వాల్కర్ వ్యతిరేకమని చెప్పేలా

సోషల్ మీడియాలో దిగ్విజయ్ పోస్ట్ పెట్టారని న్యాయవాది తన ఫిర్యాదులో ఆరోపించారు. దీని ద్వారా దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాలలో ఆర్ఎస్ఎస్ పట్ల ద్వేషాన్ని రేకెత్తించడానికి దిగ్విజయ్ యత్నించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘దళితులు, వెనుకబడినవారు, ముస్లింలకు సమాన హక్కులు కల్పించడం కంటే బ్రిటీష్ పాలనలో జీవించడమే నాకు ఇష్టం’’ అని గోల్వాల్కర్ చెప్పారంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌లో దిగ్విజయ్ ప్రస్తావించారు.

"మీకు మద్దతుగా నిలిచిన వారంతా ఇంట్లో కూర్చున్నారు"

ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మరో ట్వీట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఒకప్పుడు నీళ్ళు తాగి తాగి మిమ్మల్ని (మోడీ, అమిత్ షా) తిట్టిన వాళ్లనే ఇప్పుడు దగ్గరికి తీసుకుంటున్నారు..ఈరోజు వాళ్ళు మిమ్మల్ని పొగడొచ్చు. కానీ, మీరిద్దరూ కుర్చీలో నుంచి దిగిన రోజు ఈ ద్రోహులంతా ముందుగా మిమ్మల్ని వదిలి పారిపోతారు’’ అని హెచ్చరించారు. “చెడు సమయాల్లో మీకు(మోడీ, అమిత్ షా) మద్దతుగా నిలిచిన వారందరూ ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. ఆత్మగౌరవం కలిగిన వారిని వదిలిపెట్టి.. నయవంచకులతో చేతులు కలిపి మీరు యుద్ధానికి దిగుతారా..? మీరిద్దరూ పెద్ద తప్పు చేస్తున్నారు’’ అని దిగ్విజయ్ కామెంట్ చేశారు. “నేను ఎల్లప్పుడూ మీ ఇద్దరికీ(మోడీ, అమిత్ షా) విమర్శకుడిగా ఉంటాను.. మీరు మీ భావజాలంతో ఎప్పుడూ రాజీపడనందుకు మిమ్మల్ని అభిమానిస్తున్నా. దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదించాలి’’ అని సింగ్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News