ఈశాన్య రాష్ట్రాల్లో ‘రెమాల్’ బీభత్సం..21 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌ను తాకిన రెమాల్ తుపాన్ ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి మిజోరం, మేఘాలయా, అసోంలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ను తాకిన రెమాల్ తుపాన్ ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి మిజోరం, మేఘాలయా, అసోంలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కరెంట్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. అంతేగాక రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఘటనల్లో మొత్తంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మిజోరంలో క్వారీ కుప్పకూలడంతో 17 మంది మరణించగా, అసోంలో ముగ్గురు, మేఘాలయాలో ఒకరు మృతి చెందారు. అంతేగాక అసోంలో 17 మంది, మేఘాలయాలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మిజోరంలో కూలిన గ్రానైట్ క్వారీ
తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలో ఒక గ్రానైట్ క్వారీ ఒక్కసారిగా కూలిపోయి అక్కడే ఉన్న కార్మికులపై పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మృతి చెందిన వారిలో 4 ఏళ్ల బాలుడు, 6 ఏళ్ల బాలిక కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.17 మృత దేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మరో ఏడుగురు శిథిలాల కిందనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం లాల్దుహోమా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదిలా ఉండగాభారీ వర్షాల కారణంగా ఐజ్వాల్‌లోని సేలం వెంగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒక భవనం కొట్టుకుపోయింది, దీంతో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు.
అసోంలో భారీ వర్షాలు
మరో ఈశాన్య రాష్ట్రమైన అసోంలో కూడా బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, మోరిగావ్ జిల్లాలో చెట్టు ఆటో రిక్షాపై పడటంతో కళాశాల విద్యార్థి మృతి చెందాడు. సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకియాజులిలో చెట్టు విరిగిపడి పాఠశాల బస్సుపై పడగా..12 మంది విద్యార్థులు గాయపడ్డారు. కమ్రూప్ జిల్లాలో వివిధ ఘటనల్లో ఇద్దరు మరణించారు. మృతులకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని, క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించాలని ఆదేశించారు.
మరోవైపు మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో మరో నలుగురు గాయపడ్డారు. మే 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం నాటికి రెమాల్ తుపాను బలహీనపడి తీవ్ర పీడన ప్రాంతంగా మారింది.