kerala Wayanad: వయనాడ్‌లో ఆరోరోజుకు చేరిన సహాయక చర్యలు
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ఆరో రోజుకు చేరుకున్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో 40 కిలోమీటర్ల మేర అన్వేషణ కొనసాగుతుందని, మృతదేహాలను వెలికితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మరింత బలగాలు, సామగ్రిని మోహరిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహ్మద్ రియాస్ ఆదివారం తెలిపారు. ముండక్కై, చూరల్‌మలలో కూడా సిబ్బంది సెర్చింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వారికి పునరావాసం కల్పించడం గురించి, ప్రతి ఒక్కరితో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా సహాయక శిబిరాల్లో నివసిస్తున్న, ఆసుపత్రులలో చేరిన వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని రియాస్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి బాధితులతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, పరిస్థితులు సద్దుమణిగాక, అందరు సాధారణ స్థితికి వచ్చాక వారితో మాట్లాడుతామని అన్నారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని రియాస్ తెలిపారు. సహాయక చర్యలు తుదిదశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిధిలాలు, బురద క్రింద ఉన్న వారిని గుర్తించడానికి అధునాతన రాడార్లు, జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. భారీ యంత్రాలను సైతం ఉపయోగిస్తున్నారు. నిర్వాసిత బాధితులకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.