Encounter: నెత్తురోడిన ఛత్తీస్‌గఢ్.. 18 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్ మరోసారి నెత్తురోడింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భీకర కాల్పులతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో శనివారం ఉదయం 8 గంటలకే మొదలైన గన్ ఫైరింగ్‌లో 17 మంది మావోయిస్టులు మరణించగా.. నలుగురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. అలాగే.. సీనియర్ మావోయిస్టు నేత, డజన్‌కుపైగా భారీ దాడుల్లో పాలుపంచుకున్న కుడం జగదీశ్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) మరోసారి నెత్తురోడింది. సుక్మా(సుక్మా Dist), బీజాపూర్(Bijapur) జిల్లాల్లో భీకర కాల్పులతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో శనివారం ఉదయం 8 గంటలకే మొదలైన గన్ ఫైరింగ్‌లో 17 మంది మావోయిస్టులు(Maoists) మరణించగా.. నలుగురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. అలాగే.. సీనియర్ మావోయిస్టు నేత, డజన్‌కుపైగా భారీ దాడుల్లో పాలుపంచుకున్న కుడం జగదీశ్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. స్పాట్‌లో భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే రోజు పొరుగునే ఉండే బీజాపూర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఒక మావోయిస్టు మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్‌గఢ్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఎన్‌కౌంటర్ వార్తను సోషల్ మీడియాలో పంచుకుంటూ నక్సలిజంపై మరో మెరుపుదాడి అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్ చేశారు. భారీగా ఆయుధాలు, ఆటోమేటిక్ ఆయుధాలను సుక్మా ఆపరేషన్‌లో బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. అలాగే, తుపాకులతో పరివర్తన రాదని, అభివృద్ధి, శాంతి ద్వారానే మార్పు సాధ్యపడుతుందని వివరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు నక్సలిజాన్ని మోడీ ప్రభుత్వం సమూలంగా నిర్మూలిస్తుందని పునరుద్ఘాటించారు.
ముందస్తు సమాచారంతోనే..
కేర్లపాల్ పోలీసు స్టేషన్ ఏరియాలోని గోగుండా, నెందుం, ఉపంపల్లి గ్రామాల్లో మావోయిస్టులున్నట్టు తమకు ముందస్తు సమచారం అందిందని, దీని ఆధారంగానే డీఆర్జీ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ 159వ బెటాలియన్ జవాన్లతో శుక్రవారం రాత్రే యాంటీ నక్సలైట్ ఆపరేషన్ ప్రారంభించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పీ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో భీకర కాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటలపాటు ఫైరింగ్ జరిగాక స్పాట్‌లో జవాన్లు పరిశీలనలు చేయగా.. 17 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు సుందర్రాజ్ వివరించారు. అందులో ఏడుగురు మావోయిస్టులను గుర్తించామని, మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని చెప్పారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభించాయి. ఏకే 47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, ఒక రాకెట్ లాంచర్, బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ సహా పేలుడు పదార్ఘాలు లభించినట్టు అధికారవర్గాలు వివరించాయి. గాలింపులు కొనసాగుతున్నట్టు తెలిపాయి. బీజాపూర్ జిల్లా నర్సాపూర్-టేకుమట్ల గ్రామాల సమీపంలోని అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించారు. ఘటనాస్థలిలో ఒక ఆయుధాన్ని జవాన్లు రికవరీ చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. కాగా, మార్చి 20న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో భద్రతాదళాలు కనీసం 30 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 134 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్ అవ్వగా.. అందులో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మరణించారు.
తలపై 25 లక్షల రివార్డు
గుర్తించిన ఏడుగురు మావోయిస్టు మృతదేహాల్లో కుడం జగదీశ్ అలియాస్ బుద్ర ఉన్నట్టు అధికారులు తెలిపారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దర్భా డివిజన్ సెక్రెటరీ బాధ్యతలున్న జగదీశ్ డజన్‌కు మించి కీలక దాడుల ఘటనల్లో నిందితుడిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్ సహా సుమారు 27 మంది మరణించిన జీరాం ఘాటి, దర్భా లోయ దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలోనూ తలపై 25 లక్షల రివార్డున్న జగదీశ్ ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. మిగిలిన ఆరు మృతుల్లో నలుగురు ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు.