Strong Warning: రీల్స్ అతిగా చూస్తున్నారా.. వైద్యుల కీలక హెచ్చరిక
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వారుండరు.
దిశ, వెబ్ డెస్క్: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేని వారుండరు. అలాగే, స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. కొంచెం టైం దొరికితే చాలు.. ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు, అతిగా ఫోన్ చూడటంతో 'బ్రెయిన్ రాట్ (Brain Rot)' బారిన పడుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కంటి సమస్యలూ (Eye Disorders) పెరుగుతున్నట్లు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.
ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ప్రముఖ నేత్ర వైద్యులు ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అదేపనిగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో షార్ట్స్, వీడియోలను చూస్తున్న వారిలో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల పిల్లల్లో కళ్లు పొడిబారిపోవడం, హ్రస్వదృష్టి పెరగడం, కళ్లు ఒత్తిడికి గురికావడంతో పాటు చిన్నప్పుడే మెల్లకన్ను రావడం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్ద వారు కూడా ఈ బ్లూ లైట్‌కు గురికావడం వల్ల తరచూ తలనొప్పి, మైగ్రేట్, నిద్రలేమి వంటి సమస్యల బారినపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అధ్యయనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
మితిమీరిన, నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అంటే.. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే, బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నించడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి చర్యలతో దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చు.