Surat-Kolkata flight: విమానంలో బీడీ తాగుతూ పట్టుబడ్డ వ్యక్తి అరెస్టు
విమానంలో బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సూరత్-కోల్‌కతా విమానంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: విమానంలో బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సూరత్-కోల్‌కతా విమానంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం సూరత్ నుంచి కోల్ కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో, టేకాఫ్ ఆలస్యమయ్యింది. ప్రయాణికులు విమానంలో ఎదురుచూస్తుంటగా.. వాష్ రూంలోనుంచి పొగ రావడాన్ని సిబ్బంది గమనించి ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. తనిఖీలు చేపట్టగా.. పశ్చిమబెంగాల్ కు చెందిన అశోక్ బిశ్వాస్ బ్యాగులో బీడీలు, అగ్గిపెట్టను గుర్తించారు. అతడు వాష్ రూంలో బీడీ తాగినట్లు గుర్తించి విమానం నుంచి దింపేశారు. దీంతో, పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారుల కళ్లుగప్పి ప్రయాణికుడు నిషేధిత వస్తువులను విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే అగ్గిపెట్టె తెచ్చినందుకు పోలీసులు అతనిపై బీఎన్ఎస్ సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కాకపోతే, ఎయిర్ లైన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.