రాజ్యాంగ విజయం ప్రజల ప్రవర్తనపై ఆధారపడుతోందన్న సోనియా
కాంగ్రెస్ మాజీ చీఫ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడికి దిగారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడికి దిగారు. అధికారాన్ని తప్పుగా ఉపయోగించేవారే నిజమైన దేశవ్యతిరేక శక్తులని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని టెలిగ్రాఫ్‌లో విరుచుకపడ్డారు. మతం, భాష, కులం ప్రతిపాదికన భారతీయులను విభజిస్తూ.. తమ అధికారాలను దుర్వినియోగం చేసేవారే సంఘ విద్రోహ శక్తులని అన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ను గుర్తు చేస్తూ రాజ్యాంగ విజయం పరిపాలించే బాధ్యతను అప్పగించిన ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని హెచ్చరించారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న పాలకులు రాజ్యాంగంలోని సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం పునాదులను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై జరుగుతున్న క్రమబద్ధమైన దాడిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా పనిచేయాలని ఆమె కోరారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్ అనేకమంది మధ్య తీవ్రమైన విభేదాలతో నిండి ఉందని ఆమె పేర్కొన్నారు. తన చివరిదశలో కుల వ్యవస్థను దేశ వ్యతిరేకమని అంబేడ్కర్ పేర్కొన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇది పూర్తిగా దేశ వ్యతిరేకమే కాకుండా విభజనను ప్రేరేపిస్తుందని తెలిపారన్నారు. ప్రభుత్వ రంగ విభాగాల నిర్లక్ష్య ప్రైవేటీకరణ దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు భద్రత, సామాజిక చైతన్యాన్ని అందించే రిజర్వేషన్ల వ్యవస్థను కుదిపేస్తున్నదని ఆమె వాదించారు. నూతన సాంకేతికల రాకతో జీవనోపాధికి ముప్పుగా ఉన్నప్పటికీ.. మెరుగైన నిర్వహణతో ఎక్కువ సమానత్వాన్ని నిర్ధారించడానికి అవకాశాలను సృష్టిస్తోందని ఆమె అన్నారు.