మరో కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

Update: 2023-08-07 13:23 GMT

న్యూఢిల్లీ : మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశ పౌరుల డేటా దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలకు వీలు కల్పించే "డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023"కు లోక్ సభలో సోమవారం మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. దీని ద్వారా దేశ పౌరుల డిజిటల్ హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని కేంద్రం చెబుతోంది. వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నది ప్రభుత్వ వాదన. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం గతవారమే లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే దీనిపై సోమవారం చర్చ చేపట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఓ వైపు విపక్షాల నిరసనలు కొనసాగుతుండగానే మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంది.

ఇక ఇప్పటికే లోక్‌సభలో పాస్‌ అయిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వి ప్రారంభిస్తూ.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. ఈ బిల్లు ఫెడరలిజం సూత్రాలను, సివిల్ సర్వీస్ అకౌంటబిలిటీతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. పౌర సేవలను ‘నియంతృత్వ పౌర సేవలు’గా మారుస్తోందని ఆరోపించారు. వాజ్‌పేయి, అద్వానీ ఆశయాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ధ్వజమెత్తింది. ఇక మీడియేషన్ బిల్లు, ఫార్మసీ (సవరణ) బిల్లు, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లులను కూడా లోక్ సభ ఆమోదించింది.

ఆవును జాతీయ జంతువుగా గుర్తించే యోచన లేదు : కేంద్రం

ఆవును జాతీయ జంతువుగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోందా అని బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు లోక్ సభలో సమాధానం ఇచ్చారు. 'జాతీయ జంతువు'గా పులిని, 'జాతీయ పక్షి'గా నెమలిని 1972 వన్యప్రాణుల (రక్షణ) చట్టంలోని షెడ్యూల్-I నోటిఫై చేసిందని గుర్తు చేశారు.


Similar News