Rajya Sabha bypolls: రాజ్యసభ బై పోల్స్‌లో 12 స్థానాలూ ఏకగ్రీవమే.. 11 సీట్లు ఎన్డీఏ కైవసం

దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-08-27 17:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ఎన్డీయే కూటమి 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 9, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 1, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి ఒక సీటు దక్కింది. అలాగే మరో సీటులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. దీంతో ఎన్నిక లేకుండానే రాజ్యసభ బైపోల్స్ ముగిశాయి.

ఎన్నికైన అభ్యర్థులు వీరే

అసోం నుంచి మిషన్‌ రంజన్‌ దాస్‌, రామేశ్వర్‌ తేలీ, బిహార్‌ నుంచి మనన్‌ కుమార్‌ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్‌ చౌదరి, మధ్యప్రదేశ్‌ నుంచి కేంద్ర మంత్రి జార్జ్‌ కురియన్‌, మహారాష్ట్ర నుంచి దైర్య శీల్‌ పాటిల్‌, ఒడిశా నుంచి మమతా మోహంతా, రాజస్థాన్‌ నుంచి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు, త్రిపుర నుంచి రాజీబ్ భట్టాచార్యలు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. అలాగే ఎన్డీయే మిత్ర పక్షాలకు చెందిన అజిత్ పవార్ వర్గం నుంచి నితిన్ పాటిల్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా బిహార్ నుంచి ఎన్నికయ్యారు. అంతేగాక తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఎన్నికయ్యారు.

మెజారిటీ మార్కుకు చేరిన ఎన్డీయే!

11 స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందటంతో రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ మార్కును చేరుకుంది. రాజ్యసభలో మొత్తం 245 సీట్లకు గాను ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. మరో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెజారిటీ సంఖ్య 119 కాగా తాజాగా ఎన్డీఏ 11 స్థానాలను కైవసం చేసుకోవడంతో 112 స్థానాలకు చేరుకుంది. అలాగే ఎన్డీఏకు ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉండటంతో మెజారిటీకి చేరువైంది. మరోవైపు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య 85కు చేరుకుంది. దీంతో సభలో బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ ప్రభుత్వం బిజూ జనతాదళ్, వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్, ఏఐఏడీఎంకే వంటి పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 27గా ఉండగా.. ప్రతిపక్ష హోదాకు అవసరమైన 25 సీట్ల కంటే రెండు ఎక్కువ.


Similar News