దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అతడే: ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ఉద్రిక్తంగా మారుతోంది. రాహుల్ గాంధీకి అడుగడుగునా అడ్డంకులు ఎదురు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ఉద్రిక్తంగా మారుతోంది. రాహుల్ గాంధీకి అడుగడుగునా అడ్డంకులు ఎదురు అవుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు అనుమతి నిరాకరిస్తే.. మరికొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు రాహుల్ యాత్రను అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. సోమవారం ఓ ఆలయంలోకి వెళ్లకుండా రాహుల్ గాంధీని అడ్డుకున్న అధికారులు.. ఇవాళ గౌహతిలో యాత్రను అడ్డుకున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వ తీరు.. సీఎం హిమాంత బిస్వా శర్మపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం హిమాంత బిస్వా శర్మ అని తీవ్ర విమర్శలు చేశారు.
హిమాంత బిస్వా శర్మ బెదిరింపులకు భయపడేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లో అస్సాంలో యాత్రను కొనసాగిస్తామని రాహుల్ తేల్చిచెప్పారు. జోడో యాత్రను అడ్డుకోవడం ద్వారా మాకే మంచి పబ్లిసిటీ లభిస్తోందన్నారు. అస్సాంలో ఎక్కడికెళ్లినా అవినీతి, నిరుద్యోగం, అక్రమాలే కనిపిస్తున్నాయి నిప్పులు చెరిగారు. బీజేపీ వ్యవహరిస్తోన్న తీరు దేశమంతా గమనిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీజీపీని సీఎం బిస్వా శర్మ ఆదేశించారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని రావణుడితో పోల్చాడు బిస్వా శర్మ. రాహుల్ గాంధీని సీఎం రావణుడితో పోల్చడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.