HMPV INDIA : దేశంలోకి హెచ్ఎంపీవీ వైరస్..స్టాక్ మార్కెట్లు షేక్
చైనా(China)లో విస్తరించి క్రమంగా భారత్(INDIA) లోకి అడుగుపెట్టి(Entry)న హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) ప్రజలను ప్రారంభ దశలోనే భయపెడుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)లో విస్తరించి క్రమంగా భారత్(INDIA) లోకి అడుగుపెట్టి(Entry)న హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) ప్రజలను ప్రారంభ దశలోనే భయపెడుతోంది. బెంగుళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు, అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. దేశంలోకి హెచ్ఎంపీవీ వైరస్ ఎంట్రీ దెబ్బకు మనుషుల కంటే ముందుగా స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు దేశంలో నమోదైన వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను పడేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పతనం అవ్వగా.. నిఫ్టీ 23,550 స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు చేరింది.
ఉదయం సెన్సెక్స్ 79,281.65 (క్రితం ముగింపు 79.223.11) పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభనష్టాల మధ్య కొనసాగింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీని గుర్తించినట్లు వార్తలు రావడంతో సూచీల పతనం ప్రారంభమైంది. అనంతరం భారీ నష్టాల్లోకి పడిపోయింది.. ఇంట్రాడేలో 77,781.62 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.82 వద్ధ నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, సన్ ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లూ నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 76.30 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2645 డాలర్ల వద్ద కొనసాగుతోంది.