రాహుల్ గాంధీ డబుల్ సీన్!
సినిమాల్లో హీరోలు తరచూ ద్వి పాత్రాభినయం చేసి అలరిస్తారు.
దిశ, వెబ్ డెస్క్: సినిమాల్లో హీరోలు తరచూ ద్వి పాత్రాభినయం చేసి అలరిస్తారు. అచ్చం హీరోలు, రాజకీయ నాయకుల్లా ఉండే డూప్‌లను మనం తరచూ చూస్తునే ఉంటాం. అయితే అలాంటి ఘటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురైంది. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో ఉండగా అచ్చం రాహుల్ గాంధీలానే ఉన్న మహమ్మద్ ఫైసల్ చౌదరి(24) రాహుల్‌ను కలిశారు. యాత్రికులతో కలిసి నడుస్తుండగా ఫైసల్‌ను చూసిన రాహుల్ దగ్గరకు పిలిచి ఐదు నిమిషాలు మాట్లాడారు.
మహమ్మద్ ఫైసల్ చౌదరి ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లా మవానాకు చెందినవాడు. అచ్చం రాహుల్ గాంధీలా ఉండే ఫైసల్ ను స్థానికంగా అందరూ ఛోటా రాహుల్ గాంధీ అని పిలుస్తుంటారట. ఫైసల్ తండ్రి కాంగ్రెస్ పార్టీకి విరాభిమాని కాగా ఈ యువకుడు బీఏ చదువును మధ్యలో ఆపేసి వ్యవసాయం బాట పట్టాడు. అయితే రాహుల్ గాంధీతో ఫోటో దిగాలన్న యువకుడి కోరిక జనవరి 12న తీరింది. దీంతో యువకుడు ఫుల్ ఖుష్ అయ్యాడు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎన్నేళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని ఫైసల్‌ను అడిగారు. ఫైసల్ రాహుల్ గాంధీలానే తెల్లరంగు టీషర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొన్నారు. స్థానికంగా చాలా మంది తనని రాహుల్ గాంధీలా ఉన్నావని అంటారని ఫైసల్ తెలిపాడు. కొంత మంది తనతో సెల్ఫీలు సైతం దిగుతారని చెప్పుకొచ్చాడు.