Rahul gandhi: ప్రజలను మోసం చేయడానికే బీజేపీ ప్రయత్నం.. రాహుల్ గాంధీ విమర్శలు
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బీఆర్ అంబేడ్కర్ వంటి దళిత నేతల పట్ల గౌరవం ఉన్నట్టు నటిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. దేశ రాజ్యాంగం నిరంతరం దాడికి గురవుతోందని తెలిపారు. దళిత స్వాతంత్ర్య సమర యోధుడు జగలాల్ (Jaglal) జయంతి సందర్భంగా బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. భారతదేశంలోని ప్రతి సంస్థలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు నాయకత్వ స్థానాన్ని చేపట్టే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు. వారికి కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదని నొక్కి చెప్పారు.
దళితులు, అణగారిన వర్గాల హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తున్నందున దానికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఉన్నాయని ఆరోపించారు. మీడియాలో దళితుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అందుకే వారి సమస్యలు బయటకు రావడం లేదని నొక్కి చెప్పారు. మోడీ అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నారని, ఎన్నికల్లో వారికి లభించే టిక్కెట్ల సంఖ్యను ఉదహరిస్తున్నారని కానీ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అన్ని అధికారాలను లాక్కున్నాడని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలోబిహార్‌లో కుల గణన సర్వే అనుకున్న స్థాయిలో జరగలేదని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుల గణనను పకడ్భందీగా నిర్వహించిందని తెలిపారు.