Amit Shah: ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ 'సహకార్ టాక్సీ'

డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఈ ట్యాక్సీ సేవలను రూపొందించినట్టు మంత్రి తెలిపారు.

Update: 2025-03-27 05:45 GMT
Amit Shah: ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ సహకార్ టాక్సీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉబర్, ఓలా వంటి క్యాబ్ సేవలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే, డిమాండ్‌ను బట్టి ఆయా క్యాబ్ సర్వీసెస్ కంపెనీలు ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి కస్టమర్లకు అధిక భారంగా కూడా మారుతున్న సందర్భాలున్నాయి. కస్టమర్ల నుంచి ఎక్కువ వసూలు చేసినప్పటికీ క్యాబ్‌లను నడిపే డ్రైవర్లకు మాత్రం కంపెనీలు నామమాత్రంగానే చెల్లిస్తుంటాయి. దీనిపై అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారంగా 'సహకార్ ట్యాక్సీ' పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఈ ట్యాక్సీ సేవలను రూపొందించినట్టు మంత్రి తెలిపారు. ఉబర్, ఓలా లాంటి యాప్ ఆధారిత సేవల తరహాలోనే సహకార్ ట్యాక్సీ సేవలుంటాయి. మధ్యవర్తుల బెడద లేకుండా డ్రైవర్లు టూ-వీలర్, ట్యాక్సీలు, రిక్షాలు, కార్లను రిజిస్టర్ చేసుకునేలా వీలు కల్పిస్తుంది. మరికొన్ని నెలల్లో డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే విధంగా ప్రధాన సహకార ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తామని హోం మంత్రి తెలిపారు. ఈ చొరవ 'సహకార్ సే సమృద్ధి(సహకారంతో శ్రేయస్సు) అనే ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా తీసుకున్నదని చెప్పారు. ఇది కేవలం నినాదం కాదు. సహకార మంత్రిత్వ శాఖ మూడున్నరేళ్లుగా అవిశ్రాంతంగా దీనిని అమలు చేయడానికి కృషి చేసింది. మరికొన్ని నెలల్లో డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలను అందించే ప్రధాన సహకార టాక్సీ సర్వీసులు ప్రారంభమవుతాయని వివరించారు. 

Tags:    

Similar News