Poster war: కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ తారాస్థాయికి చేరింది.

Update: 2023-10-06 14:26 GMT

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ తారాస్థాయికి చేరింది. భారతదేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ‘న్యూ ఏజ్ రావణుడు’ అంటూ.. బీజేపీ ట్వీట్ చేయడం విమర్శలకు దారితీసింది. దీనికి ప్రతిగా ప్రధాని నరేంద్ర మోడీని అదానీ చేతిలో కీలు బొమ్మగా చూపిస్తూ తాజాగా మరొక పోస్టర్ విడుదల చేసింది. ముందుగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడటంతోనే పోస్టర్ వార్ మొదలైంది. ‘ఎవరు పెద్ద అబద్ధాలకోరు?’ అనే టైటిల్‌తో ఒక పోస్టర్‌ను, ‘పీఎం నరేంద్ర మోడీ జుమ్లా బాయ్’ అనే క్యాప్షన్‌తో మరొక పోస్టర్‌ను పోస్ట్ చేసింది.

దీంతో ఒక రోజు గ్యాప్ తర్వాత, రాహుల్ గాంధీని ‘న్యూ ఏజ్ రావణ్’ గా చిత్రీకరిస్తూ బీజేపీ సైతం పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ మేరకు స్పందించిన కాంగ్రెస్.. ‘ఈ గ్రాఫిక్ పోస్టర్ అసహ్యకరమైనదే కాక నిస్సందేహంగా ప్రమాదకరమైంది. ఇది స్పష్టంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడానికే ఉద్దేశించబడింది. భారతదేశాన్ని విభజించాలనుకునే శక్తులే అతని తండ్రి, అమ్మమ్మలను హత్య చేశాయి’ అని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.


Similar News