Rahul gandhi: ప్రజల సొమ్ముతోనే అనంత్ అంబానీ పెళ్లి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-01 14:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు చెందిన సొమ్ముతోనే అంబానీ తన కుమారుడి పెళ్లి చేశారని ఆరోపించారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని పెళ్లి కోసం వృథాగా ఖర్చు చేశారని విమర్శించారు. హర్యానాలోని సోనిపట్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘అనంత్ పెళ్లికి అంబానీ వేల కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బంతా ప్రజలదే. సాధారణ ప్రజలు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే బ్యాంకు నుంచి లోన్లు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే. కానీ దేశంలో 25 మంది మాత్రం వారి కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధానాన్ని ప్రధాని మోడీ అభివృద్ధి చేశారు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేసి దేశంలోని కొద్దిమంది బిలియనీర్ల కోసమే పనిచేస్తోందని మండిపడ్డారు. భారత సైనికుల నుంచి పెన్షన్లు, అమరవీరుల హోదాను లాక్కోవడానికే అగ్నిపథ్ వంటి పథకాలు ప్రారంభించారన్నారు. 


Similar News