ముడా భూ కుంభకోణంలో కీలక పరిణామం
కర్ణాటకలో జరిగిన ముడా(మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) భూకుంభకోణం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో జరిగిన ముడా(మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) భూకుంభకోణం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddharamaiah) సతీమణి పార్వతి, ముడా(MUDA) కీలక నిర్ణయాలు తీసుకోవడంతో మంగళవారం కర్ణాటక రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కుంభకోణం సీఎం సీటుకే ఎసరు తేవడంతో ముడా భూములను తిరిగి ఇచ్చేస్తానని పార్వతి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. 'ముడాకు చెందిన 14 ఫ్లాట్లను తిరిగి ఇవ్వడానికి గల కారణం.. అవినీతి మచ్చ లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు వాటిల్లుతుందని మాత్రమే కాని ఎవరికో భయపడి కాదు. మా పుట్టింటి వారు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమి వలన ఇంత గొడవ జరుగుతుందని ఊహించలేదు. ప్రజల్లో గుండెలో చిరస్థాయిగా పేరు నిలుపుకున్న మా కుటుంబానికి ఈ భూములు తృణపాయం వంటివి. నేను ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరూ లేరు, ఇంట్లో ఎవరినీ కనీసం సంప్రదించకుండా స్వయంగా నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మూలంగా నా భర్త నష్టపోకూడదు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాను. రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మహిళలను మీ రాజకీయాల్లోకి లాగకండి' అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ ప్రకటనపై స్పందించిన ముడా అధికారులు భూములు వెనక్కి తీసుకునేందుకు అంగీకరిస్తూ ప్రకటన జారీ చేశారు.