Jammu kashmir: మూడో దశలో 65.58 శాతం పోలింగ్.. జమ్మూ కశ్మీర్‌లో ముగిసిన ఎన్నికలు

జమ్మూ కశ్మీర్ మూడో దశ ఎన్నికల్లో భాగంగా 7 జిల్లాల్లోని 40 స్థానాలకు ఓటింగ్ జరగగా.. 65.58 శాతం పోలింగ్ నమోదైంది.

Update: 2024-10-01 16:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడో దశ ఎన్నికల్లో భాగంగా 7 జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరగగా.. 65.58 శాతం పోలింగ్ నమోదైంది. ఉధంపూర్‌ జిల్లాలో అత్యధికంగా 72.91శాతం నమోదు కాగా.. అత్యల్పంగా బారాముల్లాలో 55.73 శాతం నమోదైంది. ఇక, సాంబాలో 72.41 శాతం, కథువాలో 70.53 శాతం, జమ్మూలో 66.79 శాతం, బందిపొరాలో 64.85 శాతం, కుప్వారాలో 62.76 శాతం ఓట్లు పోలయ్యాయి. తొలి దశలో 61.38 శాతం, రెండో దశలో 57.31 శాతం కంటే చివరి దశలోనే అధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అన్ని దశల ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఈసీ తెలిపింది.

ఎన్నికలు ముగిసిన అనంతరం సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయని తెలిపారు. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత ప్రేరేపిస్తుందని కొనియాడారు. ఒకప్పుడు తీవ్ర వాదం, ప్రజాస్వామ్య ప్రక్రియలను బహిష్కరించిన ప్రాంతంలో ఓటర్లు గణనీయంగా పాల్గొని ఓటేశారని ఈసీ తెలిపింది. 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగిందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని తెలిపింది.

కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల ఎన్నికలకు గాను సెప్టెంబర్ 18న మొదటి దశ, అదే నెల 25న రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఈ నెల 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటి సారి ఎన్నికలు జరగనుండటంతో ఎలక్షన్ రిజల్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీలు కూటమిగా పోటీ చేయగా, బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లు ఒంటరిగా బరిలోకి దిగాయి. 


Similar News