High court: యువత బ్రెయిన్‌వాష్ చేసే ప్రసంగాలను విస్మరించలేం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాద ఘటనలు జరగనందున ప్రసంగాలతో యువతను బ్రెయిన్ వాష్ చేయడాన్ని విస్మరించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద ఘటనలు జరగనందున ప్రసంగాలతో యువతను బ్రెయిన్ వాష్ చేయడం, దేశానికి వ్యతిరేకంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని విస్మరించలేమని ఢిల్లీ హైకోర్టు (Delhi high court) వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఉగ్రవాద కేసులో నిందితుడిగా ఉన్న అల్‌ఖైదా టెర్రరిస్టు మహ్మద్ అబ్దుల్ రెహమాన్ (Abdul Rehaman) దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. రెహమాన్ గతంలో ఉపా కేసులో దోషిగా తేలగా ట్రయల్ కోర్టు ఏడేళ్ల 5 నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రెహ్మాన్ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌ను తిరస్కరించిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉగ్రవాద సంస్థలతో కుట్రలో పాల్గొనడం, ఆ సంస్థలకు మద్దతిస్తున్న వ్యక్తులతో రెహ్మా్న్ సంబంధం కలిగి ఉన్నాడని పేర్కొంది. కాబట్టి ఇలాంటి కుట్రల్లో రహస్య కార్యకలాపాలు అవసరం లేదని, ఉగ్రవాద సంస్థలకు అంతర్గతంగా మద్దతు లభిస్తుందని తెలిపింది. భారీ నెట్‌వర్క్‌లో భాగమైన ఇతర నిందితులతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడని రుజువు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో నమోదు చేయబడిన సాక్ష్యాలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని పేర్కొంది. ఉగ్రవాద చర్యకు పాల్పడినందున రెహమాన్ అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది.