Al Jazeera: పాలస్తీనాలో ఆల్‌జజీరాపై బ్యాన్.. రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోందని ఆరోపణ
ఖతార్‌కు చెందిన వార్తా సంస్థ ఆల్‌జజీరాపై పాలస్తీనాలో నిషేధం విధించారు. ఈ మేరకు పాలస్తీనా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఖతార్‌కు చెందిన వార్తా సంస్థ ఆల్‌జజీరా (Al Jazeera)పై పాలస్తీనాలో నిషేధం విధించారు. ఈ మేరకు పాలస్తీనా అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. రమల్లాలోని అల్ జజీరా నెట్‌వర్క్ కార్యాలయంలోకి వెళ్లి సంస్థ ప్రతినిధులకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు. అల్‌జజీరా రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేస్తోందని ఆరోపించారు. ‘సాంస్కృతిక, అంతర్గత, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రుల కమిటీ అల్ జజీరా ప్రసారాలను, పాలస్తీనాలోని దాని కార్యాలయ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది’ అని తెలిపారు. పాలస్తీనా జర్నలిస్ట్‌ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ డిసిషన్ తీసుకున్నట్టు వెల్లడించారు. ఆల్ జజీరా తీవ్రమైన పత్రికా ఉల్లంఘనలకు పాల్పడుతోందని తెలిపారు. ‘తప్పుడు సమాచారాన్ని నియంత్రించడం, హింసను ప్రేరేపించే కథనాలు నిలువరించడం, ప్రాథమిక విలువలకు అనుగుణంగా అల్ జజీరా వ్యవహరించే వరకు ఈ చర్యలు అమల్లో ఉంటాయి’ అని పాలస్తీనా అథారిటీ తెలిపింది.
అయితే ఈ నిర్ణయంపై ఆల్ జజీరా స్పందించింది. శరణార్థి శిబిరంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పెరుగుతున్న ఘటనలను కవర్ చేయకుండా నిరోదించడానికే బ్యాన్ విధించారని తెలిపింది. మరోవైపు పాలస్తీనా అథారిటీ తీసుకున్న డిసిషన్‌ను ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) సైతం ఖండించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆక్రమణను బహిర్గతం చేసే, మా ప్రజల స్థిరత్వానికి మద్దతు ఇచ్చే మీడియా కవరేజీని కొనసాగించడం ఎంతో కీలకమని తెలిపింది. కాగా, ఆల్ జజీరాను ఇజ్రాయెల్‌లోనూ నిషేధించిన విషయం తెలిసిందే.