పంజాబ్ సీఎంకు గవర్నర్ హెచ్చరిక..

పంజాబ్‌లో అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం భగవంత్ మాన్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు.

Update: 2023-08-25 16:52 GMT

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం భగవంత్ మాన్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు. అధికారిక సమాచారానికి స్పందించకుంటే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయొచ్చని గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శనివారం తెలిపారు. తన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. కాగా.. ఆప్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దు రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై గవర్నర్ తన లేఖల్లో ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి సీఎం మాన్‌ను అడిగారు. మత్తుపదార్థాల లభ్యత, వినియోగంపై వివిధ ఏజెన్సీల నుంచి నివేదికలు అందాయని.. ఫార్మసీలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం దుకాణాల్లో కూడా అవి ఎలా దొరుకుతాయన్న ఆరోపణలు సర్వసాధారణమైపోయాయని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు డ్రగ్స్‌కు బానిసలయ్యారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా గవర్నర్ ఉటంకించారు. ఇదిలా ఉంటే.. సాధారణంగా గవర్నర్ నివేదిక పంపిన తర్వాత, ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రం నేరుగా కేంద్ర పాలన పరిధిలోకి వస్తుంది.


Similar News