పొరుగు దేశాల మధ్య నమ్మకం లేనప్పుడు..! చైనా, పాక్‌లకు కేంద్ర మంత్రి జైశంకర్ చురకలు?

చైనా, పాకిస్తాన్‌లకు పరోక్షంగా చురకలు అంటించారు. ‘నమ్మకం సడలినప్పుడు, సహకారం అందనప్పుడు, మైత్రి పలుచబడినప్పుడు కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన కారణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.

Update: 2024-10-16 17:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్‌లకు పరోక్షంగా చురకలు అంటించారు. ‘నమ్మకం సడలినప్పుడు, సహకారం అందనప్పుడు, మైత్రి పలుచబడినప్పుడు కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన కారణాలు కనిపిస్తాయి. వాటికి పరిష్కారాలు వెతకాల్సి ఉంటుంది. దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను నిజాయితీగా అమలు చేసినప్పుడు పరస్పర సహకారం, సమైక్యత వల్ల కలిగే ఫలాలు తెలియవస్తాయి’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. చైనా, పాకిస్తాన్‌లతో సంబంధాలు కుంటుపడిన నేటి సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం పరోక్షంగా ఆ దేశాలకు చురకలు అంటించినట్టుగానే చూస్తున్నారు. చైనాతో సరిహద్దులో సైనికుల మధ్య ఘర్షణలు, పాకిస్తాన్‌తో సీమాంతర ఉగ్రవాదం కారణంగా సఖ్యత కొరవడింది.

ఇదే సందర్భంలో జైశంకర్ మూడు భూతాల గురించి మాట్లాడారు. ప్రపంచాన్ని ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే భూతాలు పీడిస్తున్నాయని, ఇవి వాణిజ్యం, ప్రజల మధ్య సత్సంబంధాలకు ప్రతిబంధకాలుగా ఉంటాయని వివరించారు. శాంతి, సుస్థిరతకూ అవి అడ్డుగానే నిలుస్తాయన్నారు. ఈ మూడు భూతాలు లేకుంటే ఈ రీజియన్ శాంతి, సమరస్యత, వాణిజ్యంతో విలసిల్లుతుందని చెప్పారు.

Tags:    

Similar News