Pune: విమానంలో తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడిన మహిళ

మహారాష్ట్రలో పూణేలోని లోహెగావ్ ఎయిర్ పోర్టులో ఓ మహిళ తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడింది. ఇద్దరు తోటి ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడింది.

Update: 2024-08-19 04:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో పూణేలోని లోహెగావ్ ఎయిర్ పోర్టులో ఓ మహిళ తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడింది. ఇద్దరు తోటి ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడింది. ఉదయం 7. 45 గంటలకు పూణే నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్‌ ప్రాసెస్‌ సమయంలో ఓ మహిళ దాడికి యత్నించింది. ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై ఆ మహిళ దాడి చేసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టెబుల్స్‌ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఆతర్వాత నిందితురాలిని, ఆమె భర్తను అధికారులు విమానం నుంచి కిందకు దిపేశారు.

మహిళపై కేసు నమోదు

నిందితురాలిని ఎయిర్‌ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టినట్లు వెల్లడించారు. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వాంగ్మాలాలు రికార్డు చేశామన్నారు. దాడికి గురైన ప్రయాణికుల స్టేట్ మెంట్లను తర్వాత రికార్డు చేస్తారని వెల్లడించారు. అయితే, నిందితురాలు గృహిణి కాగా.. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. దగ్గరి బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇద్దరూ ఢిల్లీకి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉ‍న్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని అధికారులు తెలిపారు. ఇకపోతే, మహిళతో ప్రయాణించేందుకు పైలట్ నిరాకరించడంతో.. ఆమెను విమానం నుంచి దింపేసినట్లు వెల్లడించారు.


Similar News