16 రాష్ట్రాల్లో 100కు పైగా బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రియాంక

గురువారంతో 7 దశల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. దీంతో వివిధ పార్టీల నాయకులు ఇన్ని రోజులు తమ ప్రచారాలతో హోరెత్తించగా ప్రస్తుతం వారు విశ్రాంతి తీసుకుంటున్నారు.

Update: 2024-05-31 09:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గురువారంతో 7 దశల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. దీంతో వివిధ పార్టీల నాయకులు ఇన్ని రోజులు తమ ప్రచారాలతో హోరెత్తించగా ప్రస్తుతం వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయినర్‌గా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 55 రోజుల పాటు చేసిన ప్రచారంలో ఆమె దేశవ్యాప్తంగా తమ అభ్యర్థుల తరపున దాదాపు 108 బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించగా, 100 కంటే ఎక్కువ మీడియా సమావేశాల్లో మాట్లాడారు. 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రచారం చేసిన ప్రియాంక, కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంలో విజయవంతంగా తన పాత్రను పోషించారు.

ఆమె ఎన్నికల ప్రసంగాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా బీజేపీ, మోడీని ఎదుర్కొవడంలో కీలకంగా వ్యవహరించారు. అధికార పార్టీ చేసిన వ్యాఖ్యలకు సరైన సమాధానాలు ఇవ్వండలో ప్రియాంక పూర్తిగా సక్సెస్ అయినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె మాట్లాడిన విధానం, సమాధానాలు, సౌమ్యత, వినయం ప్రజల నుండి చాలా ప్రశంసలు అందుకుంది. ప్రియాంక తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో భారీ రోడ్ షోతో ముగించారు. అంతకుముందు జఖు ఆలయంలో హనుమంతుడికి ప్రార్థనలు చేసిన తర్వాత, తన చివరి రోడ్ షో నిర్వహించారు, ఇందులో వేలాది మంది పాల్గొన్నారు. ప్రియాంక ఈ ఎన్నికల సీజన్‌లో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, రాజస్థాన్‌, తెలంగాణ ఇంకా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేశారు.


Similar News