మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Update: 2024-06-10 09:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత 25 ఏళ్లలో పార్టీ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాం. దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పని చేయాలి. మరో మూడు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దాని ఇప్పటి నుంచే సమిష్టిగా అడుగులు వేయాలి’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికారం ఒకరిద్దరు చేతిలో కేంద్రీకృతం కావడానికి చెక్ పెట్టేందుకే ప్రజలు ఓట్లు వేశారని స్పష్టం చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ సత్తా చాటుతుందని దీమా వ్యక్తం చేశారు. నేడు దేశం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని పవార్ అన్నారు. గత ఐదేళ్లలో కేవలం ఒకరిద్దరు మాత్రమే తమ ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని నడిపారని, దేశం గురించి విశాల దృక్పథంతో ఆలోచించలేదని, అధికార కేంద్రీకరణకు పెద్దపీట వేయలేదని విమర్శించారు. అయితే దేశ ప్రజలు రాబోయే పరిస్థితులను ఊహించి, ఒకరిద్దరు వ్యక్తుల చేతుల్లో అధికారం ఉండకుండా చేశారన్నారు. ఈ సందర్భంగా పవార్ తన కుమార్తె బారామతి ఎంపీ సుప్రియా సూలే, ఇతర నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కాగా, పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. పలు రాజకీయా పరిణామాల దృష్యా ఈ ఏడాది ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే.


Similar News