Bihar: పాట్నాలో విద్యార్థులపై లాఠీఛార్జ్, వాటర్ క్యానన్‌ల ప్రయోగం
రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సీసీఈ)ని మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) అభ్యర్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్రరూపం దాల్చింది. వేలాదిగా అభ్యర్థులు గాంధీ మైదాన్ వద్ద గుమికూడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో లాఠీ ఛార్జీ చేశారు, నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్‌లను ప్రయోగించారు. విద్యార్థులపై పోలీసుల బలప్రయోగానికి నిరసనగా అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఏ) సోమవారం 'చక్కా జామ్'కు పిలుపునిచ్చింది. ఈ నెల 13న నిర్వహించిన బీపీఎస్‌సీ కామిటీటివ్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకైన వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై ఆరోపణలు వెల్లువత్తడంతో పాటు గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. సీసీఈని మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తుండగా, అధికారులు అందుకు విముఖంగా ఉన్నారు. విద్యార్థుల ఆందోళనలకు అర్థం లేదని, పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించినట్టు బీపీఎస్‌సీ కంట్రోలర్ రాజేష్ కుమార్ సింగ్ చెప్పారు. ఇదే అంశంపై విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన విద్యార్థుల బృందం సీఎస్‌ను కలవనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి రాకపోతే విద్యార్థుల నిరసన కొనసాగిస్తారని పేర్కొన్నారు.