Congress : జనవరి 3 నుంచి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ శుక్రవారం (జనవరి 3) నుంచి దేశవ్యాప్తంగా అన్ని బ్లాక్‌లు, రాష్ట్రాలలో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ (Jai Bapu Jai Bhim Jai Samvidhan) పేరుతో ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టనుంది.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ శుక్రవారం (జనవరి 3) నుంచి దేశవ్యాప్తంగా అన్ని బ్లాక్‌లు, రాష్ట్రాలలో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ (Jai Bapu Jai Bhim Jai Samvidhan) పేరుతో ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా జనవరి 26న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జన్మించిన మధ్యప్రదేశ్‌లోని మహౌ పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించనుంది. ఈవివరాలను కాంగ్రెస్ పార్టీ(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగిడుతున్నసందర్భంగా జనవరి 26న మహౌలో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత కూడా ప్రచారోద్యమం కొనసాగుతుందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ గొప్పతనం, రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జైరాం రమేశ్ అన్నారు. వాస్తవానికి డిసెంబరు నెలాఖరులో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలోనే ఈ ప్రచార కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం.. 2025 జనవరి 26 నుంచి 2026 జనవరి 26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ పాదయాత్ర గ్రామ, పట్టణ స్థాయుల్లో జరగనుంది. 2025 ఏప్రిల్ రెండోవారంలో గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలు జరుగుతాయి.