ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు
పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వార్తల్లోకి ఎక్కిన ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
దిశ, నేషనల్ బ్యూరో: పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వార్తల్లోకి ఎక్కిన ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న మహద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పూణే రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదంలో చిక్కుకున్న సమయంలో ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్ పలువురు రైతులను తుపాకీ చూపిస్తూ బెదిరించినట్లు వీడియో ఒకటి బయటికి రాగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో పోలీసులు తుపాకీ చూపి రైతులను బెదిరించినందుకు ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఆమెను పూణెకు తీసుకువస్తున్నారు. పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో మనోరమా భూవివాదానికి సంబంధించి పొరుగువారితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లుగా వీడియోలో ఉంది. రెండు నిమిషాల ఫుటేజీలో ఆమె, తన సెక్యూరిటీ గార్డులతో కలిసి, తుపాకీ చూపిస్తూ ఒక వ్యక్తిపై గట్టిగా అరిచారు. అయితే పక్క రైతుల భూములను ఖేడ్కర్ ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆమె చూపించిన తుపాకీకి సరైన లైసెన్స్ ఉందా లేదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.