Shamika Ravi : సోరస్ నిధులు అందింది హైదరాబాద్ ఐఎస్‌బీకి.. నాకు కాదు : శామిక రవి
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్(George Soros) నుంచి నిధులను పొందారనే ఆరోపణలపై భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(PMs adviser) సభ్యురాలు, ప్రొఫెసర్ శామిక రవి(Shamika Ravi) స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్(George Soros) నుంచి నిధులను పొందారనే ఆరోపణలపై భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(PMs adviser) సభ్యురాలు, ప్రొఫెసర్ శామిక రవి(Shamika Ravi) స్పందించారు. తనపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన ఆరోపణల్లో వాస్తవికత లేదని ఆమె స్పష్టం చేశారు. ‘‘జార్జ్ సోరస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి 2006-07 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)కు నిధులు వచ్చాయి. అయితే ఆ నిధులు ఐఎస్‌బీ బోధనా సిబ్బంది వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. అప్పట్లో నేను ఐఎస్‌బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. టీచర్‌గా, రీసెర్చర్‌గా ఆనాడు పనిచేశాను’’ అని శామిక రవి తెలిపారు.
ఐఎస్‌బీకి సోరస్ ఫౌండేషన్ నుంచి నిధులు వచ్చిన 18 ఏళ్ల తర్వాత తాను భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలిగా చేరినట్లు పేర్కొన్నారు. తన నేపథ్యం గురించి పూర్తిగా తెలుసుకోకుండా, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే దురుద్దేశంతో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపణలు చేశారని శామిక రవి మండిపడ్డారు. ‘‘2020 సంవత్సరంలో జార్జ్ సోరస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టారు. అయినా సోరస్‌కు వంత పాడుతున్నది ఎవరో అందరికీ తెలుసు’’ అని ఆమె విమర్శించారు. ఈమేరకు శామిక రవి ట్వీట్ చేశారు. మంగళవారం రోజు శామిక రవిపై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. ‘‘సోరస్ ఫౌండేషన్ నుంచి శామిక రవి నిధులు పొందారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఆమె కుట్ర పన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఆమెను ఆర్థిక సలహా మండలి సభ్యురాలి పదవి నుంచి తొలగించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.