ఒకే వేదికపై ప్రధాని మోడీ, శరద్ పవార్..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి రుజువైంది.

Update: 2023-08-01 12:03 GMT

న్యూఢిల్లీ : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి రుజువైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మహారాష్ట్రలోని పుణేలో లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడేళ్ల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శరద్ పవార్‌ ఒకే వేదికపై కన్పించారు. ఈ సందర్భంగా వేదికపై ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో తనను సత్కరించడంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇది మరపురాని క్షణమన్నారు. ఈ ప్రైజ్ మనీని "నమామి గంగే" ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు వెల్లడించారు.

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో లోకమాన్య తిలక్ పాత్రను మరువలేమన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత లేదని నిర్వాహకులు తెలిపారు. దీనికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే కూడా హాజరైన విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు శరద్‌పవార్‌ ముందే ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌ కూడా లోకమాన్య తిలక్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఇటీవల శరద్‌పవార్‌కు ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌ షాకిచ్చి.. 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలోని బీజేపీ సర్కారుతో జతకట్టారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు.


Similar News