మోడీ 3.0 @ తొలి గుడ్ న్యూస్.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు తొలి క్యాబినెట్ సమావేశం వేదికగా గుడ్ న్యూస్ వినిపించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు తొలి క్యాబినెట్ సమావేశం వేదికగా గుడ్ న్యూస్ వినిపించింది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(పీఎంఏవై) పథకం కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ స్కీంలో భాగంగా నిర్మించే కొత్త ఇళ్లకు ఎల్‌పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్లు వంటి సదుపాయాలను ప్రభుత్వం తరఫున కల్పిస్తామని వెల్లడించింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన భేటీలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన మొదటి హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీంలో భాగంగా అర్హులైన గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. గత పదేళ్లలో పీఎంఏవై పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 4.21 కోట్ల ఇళ్లను నిర్మించారు.
తొలి విదేశీ పర్యటన ఖరారు
ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సదస్సు జరగనుంది. ఈ సదస్సులో జూన్ 14న ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఆ వెంటనే ఆయన భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ నెల 15న స్విట్జర్లాండ్‌లో జరగనున్న ఉక్రెయిన్ శాంతి సదస్సుకు మోడీ దూరంగా ఉండనున్నారు.
జూన్ 17న లేదా 18న కీలక సమీక్ష
ప్రధాని మోడీ ఇటలీ నుంచి తిరిగి వచ్చాక అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేయనున్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో జూన్ 17న లేదా 18న దీనికి సంబంధించిన సమీక్షా సమావేశం ఉంటుందని అంటున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర క్యాబినెట్ తొలి సమావేశంలోనూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి మంత్రులకు మోడీ దిశానిర్దేశం చేశారు. వచ్చే వారం రోజుల పాటు ఆ అంశంపై కసరత్తు చేయాలని సూచించారు. శాఖలవారీగా పెండింగ్ ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, పథకాల అమలు తీరుతెన్నులపై ప్రత్యేక ఫోకస్ చేయాలన్నారు. ఈ దిశగా కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు, పీఎంఓ సిబ్బంది కలిసికట్టుగా ముందుకు సాగాలని మోడీ సూచించారు. గత పదేళ్లుగా తన హయాంలో బ్యూరోక్రాట్లు ఆదివారం సెలవురోజు అనే విషయాన్నే మర్చిపోయారని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.