కర్ణాటకలో ‘ఖజానా ఖాళీ’.. ప్రధాని మోడీ

కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ‘ఖాళీ’ చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు.

Update: 2023-08-01 16:56 GMT

బెంగళూరు: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ‘ఖాళీ’ చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోనూ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కర్ణాటకలో జనాకర్షక పథకాల హామీతో బీజేపీని ఓడించి మూడు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు లేవని ఒప్పుకుందన్నారు.

సంక్షేమ పథకాలకే నిధులన్నీ ఖర్చు చేసిన ప్రభుత్వం అభివృద్ధి పనులకు మాత్రం నిధులు కేటాయించకుండా ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసిందని ఆరోపించారు. పూణే మెట్రో కారిడార్లలో సేవలను ప్రారంభించిన మోడీ రూ.15 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలోనే అతి పెద్ద ఐటీ హబ్‌గా నిలిచిన బెంగళూరు ప్రపంచ పెట్టుబడులకు కేంద్రం అన్నారు. ఈ పరిస్థితిలో వేగంగా అభివృద్ధి చెందాల్సిన బెంగళూరు పథకాల సునామీలో కొట్టుకుపోతోందని చెప్పారు.

నీతి, నియ్యత్, నిష్ట ఉంటేనే అభివృద్ధి..

రాజస్థాన్‌లోనూ పన్నుల భారం పెరిగిందని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ప్రధాని మోడీ విమర్శించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు నీతి (విధానం), నియ్యత్ (ఉద్దేశం), నిష్ట (అంకితత్వం) అవసరమని ప్రధాని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి పట్టణ, గ్రామీణ పేదలకు పంచి ఇచ్చామన్నారు.

అంతకుముందు యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో 8 లక్షల గృహాలు మాత్రమే నిర్మించిందని, అందులోకి వెళ్లేందుకు గుడిసె వాసులు కూడా ఇష్టపడలేదని వివరించారు. యూపీఏ హయాంలో 5 నగరాలకే పరిమితమైన మెట్రో నెట్‌వర్క్‌ను ఇప్పుడు 20 నగరాలకు విస్తరించామని చెప్పారు. ఇన్నోవేషన్, స్టార్టప్‌ల కేంద్రంగా భారత్ గుర్తింపు పొందిందన్నారు.


Similar News