45 గంటల ధ్యానంలో ప్రధాని మోడీ.. ఫొటో విడుదల

ఏడు దశల పోలింగ్ ప్రచారం ముగిసిన తరువాత 45 గంటల పాటు ధ్యానం చేయడానికి ప్రధాని మోడీ గురువారం సాయంత్రం కన్యాకుమారిలోని ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు.

Update: 2024-05-31 05:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఏడు దశల పోలింగ్ ప్రచారం ముగిసిన తరువాత 45 గంటల పాటు ధ్యానం చేయడానికి ప్రధాని మోడీ గురువారం సాయంత్రం కన్యాకుమారిలోని ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ధ్యానంలో ఉన్నారు. తాజాగా ధ్యాన మండపం వద్ద మోడీ కూర్చుని ఉన్న ఫోటో, వీడియోను విడుదల చేశారు. దీనికి ముందు ఆయన కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశమైన మండపం వద్ద ప్రధాన మంత్రి శనివారం సాయంత్రం వరకు అక్కడే ధ్యానం చేయనున్నారు.

హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రదేశం కన్యాకుమారి.. ఇది జాతీయ ఐక్యత సందేశాన్ని ఇస్తుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. 75 రోజుల పాటు జరిగిన ఎన్నికల ప్రక్రియలో నిరంతరాయంగా పాల్గొన్న మోడీ ప్రచారం ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు ధ్యానం చేయడానికి కన్యాకుమారికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. జూన్ 1 న చివరి దశ పోలింగ్ జరగనుంది. ప్రధాని వారణాసి నుంచి పోటీ చేస్తుండగా, ఈ నియోజకవర్గంలో కూడా ఇదే రోజున పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగిసే సమయం ముందు తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ, వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని మోడీ కోరారు.

Tags:    

Similar News