TATA Aircraft Complex: - గుజరాత్ లోని వడోదరాలో సి-295 తయారీ కేంద్రం ప్రారంభోత్సవం

మేకిన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ మిషన్‌ను సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2024-10-28 06:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘మేకిన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ మిషన్‌ను సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి ఆ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు.”ఈ ప్లాంట్‌ ‘మేకిన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’ మిషన్‌ను బలోపేతం చేస్తుంది. భారత్‌-స్పెయిన్‌ భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళుతున్నాం. ఇటీవలే రతన్‌ టాటాను కోల్పోయాం. ఆయన జీవించి ఉంటే.. ఇక్కడ మన మధ్యే ఉండేవారు. ఎక్కడ ఉన్నా ఆయన దీన్ని చూసి సంతోషిస్తారు’’ అని మోడీ రతన్ టాటాకు నివాళి అర్పించారు. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌బస్‌, టాటాల భాగస్వామ్యం భారత ఎయిర్ ఫోర్స్ రంగ పురోగతికి బాటలు వేస్తుందన్నారు. ఇతర యూరప్ దేశాలు భారత్‌కు వచ్చేందుకు రెడీగా ఉందన్నారు.

టాటాల భాగస్వామ్యంతో..

టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్‌ సంస్థ సి-295 ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యూరప్ కు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారుచేయడం ఇదే తొలిసారి. స్పెయిన్‌లో తయారైన ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లు భారత్ చేరుకోవడం కూడా మొదలైంది. టాటా గ్రూప్‌నకు చెందిన 200 మంది ఇంజినీర్లు ఇప్పటికే స్పెయిన్‌లో శిక్షణ పొందుతున్నారు సి-295కు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి హైదరాబాద్‌లోని ‘మెయిన్‌ కన్‌స్టిట్యూయెంట్‌ అసెంబ్లీ’లో ఇప్పటికే ప్రారంభమైంది.


Similar News