Lucknow: లక్నో భవనం కూలిన ఘటనలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ
గాయపడిన వారిని కృష్ణా నగర్ ప్రాంతంలోని మూడు ఆసుపత్రుల్లో చేర్పించారు,
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. శనివారం ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఇస్తూ ఆదివారం ప్రకటన విడుదలైంది. అధికారిక వివరాల ప్రకారం, మూడంతస్తుల మెడికల్ గోదాం కూలిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కృష్ణా నగర్ ప్రాంతంలోని మూడు ఆసుపత్రుల్లో చేర్పించారు, కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. భవనం కుప్పకూలడం వల్ల జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 'ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భవనం కూలిన ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. బాధితులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా అందుతుంది. భవనం కూలిన ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు లక్నో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అమిత్ వర్మ ప్రకటించారు.