బాబా రాందేవ్‌కు మరోసారి సుప్రీంకోర్టు మొట్టికాయలు.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది.

Update: 2024-04-10 18:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. పతంజలి ఔషధ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి వారిద్దరు సమర్పించిన ‘బేషరతు క్షమాపణ’ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ‘‘మేం కళ్లు మూసుకొని కూర్చోలేదు. ఈ కేసులో ఉదారంగా వ్యవహరించదల్చుకోలేదు’’ అని న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘వాళ్లు ఏదో పేపర్‌ మీద మొక్కుబడిగా క్షమాపణలు రాసిచ్చారు. ఆ క్షమాపణల్ని మేం తిరస్కరిస్తున్నాం. దీన్ని ఉద్దేశపూర్వక ఉల్లంఘనగానే పరిగణిస్తాం’’ అని వ్యాఖ్యానించింది. ‘‘నిర్ణీత సమయంలోగా మాకు అఫిడవిట్లు పంపాలన్న ధ్యాసే వాళ్లకు లేనట్లు ఉంది. రాందేవ్‌, బాలకృష్ణలు తమ క్షమాపణలను ముందుగా మీడియాకు తెలియజేశారు. వాళ్లు పబ్లిసిటీనే నమ్ముకున్నట్లు దాన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది’’ అని ధర్మాసనం పేర్కొంది. పతంజలి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వివరణ ఇచ్చేందుకు యత్నించారు. అఫిడవిట్లలో లోపం ఉందని ధర్మాసనానికి వివరణ ఇవ్వబోగా.. ‘లోపం’ అనే మాట చాలా చిన్నదంటూ రోహత్గీకి ధర్మాసనం బదులిచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా తప్పులు చేయడం ఏమిటని మండిపడింది. తప్పుడు ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించిన ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగంపైనా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాధ్యుల్ని చీల్చిచెండాడి తీరుతామంటూ వ్యాఖ్యలు

‘‘పతంజలి ఆయుర్వేద ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో.. 2021లోనే కేంద్ర ఆయుష్‌ శాఖ ఉత్తరాఖండ్‌ లైసెన్సింగ్‌ అథారిటీకి లేఖ రాసింది. దానికి బదులుగా లైసెన్సింగ్‌ అథారిటీకి సదరు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ అథారిటీ కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టింది. ఇలా ఆరుసార్లు జరిగినా ఉత్తరాఖండ్‌ లైసెన్సింగ్ ఇన్‌స్పెక్టర్లు మౌనంగా ఉండిపోయారు. కాబట్టే, ఆ ముగ్గురు లైసెన్సింగ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేయాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, బాధ్యుల్ని చీల్చిచెండాడి తీరతామంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు హాజరు కాకుండా రాందేవ్, బాలకృష్ణ విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారని, ఈ కేసులో ఏప్రిల్‌ 16న ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను చూసి పతంజలి ఉత్పత్తులు తీసుకున్న అమాయకుల పరిస్థితి ఏంటంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏమిటీ కేసు ?

తమ ఉత్ప‌త్తుల వ‌ల్ల కొన్ని వ్యాధులు న‌యం అవుతాయంటూ ప‌తంజ‌లి కంపెనీ కొన్ని ప్రక‌ట‌నలు ఇస్తూ వచ్చింది. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కిందటి ఏడాది ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. ఈ పిటిషన్ పైనే ప్రస్తుతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Tags:    

Similar News