Peace deal: 35 ఏళ్ల సాయుధ పోరాటం ముగింపు.. రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం

35 ఏళ్ల సాయుధ పోరాటానికి తెరదించుతూ త్రిపురలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

Update: 2024-09-04 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 35 ఏళ్ల సాయుధ పోరాటానికి తెరదించుతూ త్రిపురలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బుధవారం ఈ అగ్రిమెంట్ జరిగింది. రెండు గ్రూపులు ఆయుధాలను వదులుకుని జనజీవన స్రవంతిలో చేరేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిపుర సీఎం మాణిక్ సాహా సైతం పాల్గొన్నారు. దీంతో దాదాపు 328 మంది కార్యకర్తలు ఆయుధాలు విడిచిపెట్టి బయటకు రానున్నారు. ఈ ఒప్పందం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 12వ అగ్రిమెంట్ కాగా, త్రిపురలో మూడో ఒప్పందం కావడం గమనార్హం.

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి కృషి: అమిత్ షా

ఒప్పందం అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. ఈశాన్య ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి, అభివృద్ధికి మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. తీవ్రవాదం, హింస లేని ఈశాన్య ప్రాంతాలను చూడాలనే మోడీ దార్శనికతను నెరవేర్చడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం అనేక ఒప్పందాలపై సంతకాలు చేయడం వల్ల దాదాపు 10 వేల మంది ఆయుధాలు వదులుకుని జన జీవన స్రవంతిలో కలిసిపోయారని గుర్తు చేశారు. 35 ఏళ్లుగా సాగుతున్న పోరాటం తర్వాత రెండు గ్రూపులు ఆయుధాలను వీడడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు.

కాగా, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ అనేది త్రిపుర రాష్ట్రంలో కీలకంగా పని చేస్తున్న మిలిటెంట్ గ్రూప్. దీనిని1990 జూలై 11న రంజిత్ దెబ్బర్మ నాయకత్వంలో స్థాపించారు. 1956 తర్వాత త్రిపురలోకి ప్రవేశించిన బెంగాలీ మాట్లాడే వలసదారులందరినీ బహిష్కరించడం, ‘త్రిపుర భూ రెవెన్యూ భూ సంస్కరణల చట్టం’, 1960 ప్రకారం గిరిజనులకు భూమిని పునరుద్ధరించడం వంటి లక్ష్యాలతో ఈ గ్రూప్ కార్యకలాపాలను నిర్వహించేది. అలాగే నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర గ్రూప్ భారత దేశం నుంచి త్రిపురను వేరు చేయాలనే లక్ష్యంతో సుధీర్ఘకాలంగా పని చేస్తోంది. తాజా ఒప్పందంతో రెండు గ్రూపుల కార్యకర్తలు బయటకు రానున్నారు.


Similar News